జర్నలిస్టుల భూ సమస్య పరిష్కరించాలి

మహాదేవపూర్, భారతవాసి: జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని మహాదేవపూర్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందించారు. సర్వేనెంబర్‌ 473లో 16 మంది వర్కింగ్‌ జర్నలిస్టులకు 23 గుంటల ప్రభుత్వ భూమిని 2023లో ప్రభుత్వం కేటాయించి పట్టాలు అందించిందని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు మిన్నుభాయ్‌ తెలిపారు. అయితే అటవీ శాఖ అభ్యంతరాలతో గృహ నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడిందని, రెవెన్యూ–అటవీ శాఖల సంయుక్త సర్వే పేరుతో మూడేళ్లుగా సమస్య పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. వెంటనే సంయుక్త సర్వే నిర్వహించి, కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి వెసులుబాటు కల్పించాలని కోరారు.